Wednesday, May 27, 2015

కథానేపథ్యం: మరణ లేఖలు

పోయినేడాది కర్నూలు కథాసమయం మిత్రులు జరిపిన రెండు రోజుల కార్యక్రమంలోని ఒక సెషన్లో కథకులు తమ ఒక కథనేపథ్యాన్ని వివరించాలి. ఇది తప్పించుకోలేనిది. కాబట్టి, ఒక కథ మీద నేను కూడా ప్రిపేరై వెళ్లాను. దాన్నే ఇక్కడ పోస్టు చేస్తున్నా.


కథాసమయం
ఇండస్ పబ్లిక్ స్కూలు, గుత్తి రోడ్, కర్నూలు; మే 31, జూన్ 1-2014
---------------------------------------------------------------

మెయిల్ చూడంగానే ఈ వచ్చేవాళ్ల లిస్టు అదీ అంతా బానేవుందిగానీ కథానేపథ్యం వివరించాలి, అనేసరికి ఉత్సాహం ఎగిరిపోయింది. ఏదో విన్నట్టు నటిద్దామని వస్తే ఈ మాట్లాడించుడు ఏందబ్బా!
తేనీటి విరామం ఒక్కటే హాయిగా ఉంది, ఆ జాబితాలో...
మిత్రుడు భగవంతం ఊరడించినట్టు, శూన్యం నింపడానికి ఏదో ఒకటి చేయాలి కదా మరి! నావి కూడా ఆ శూన్యపు భర్తీకి కొన్ని మాటలు...

సరే, మిత్రులందరికీ నమస్కారం.
కొత్తగా చూస్తున్నవాళ్లతో ఇంకా పరిచయం పెరగాల్సివుంది. కొందరి కథలు తెలుసు, కొందరివి తెలీదు...
మొత్తానికైతే రొటీన్ నుంచి ఇదొక మంచి బ్రేక్. దానికైతే సంతోషం. శ్రీశైలం వచ్చానుగానీ కర్నూలు రాలేదు, ఇది కూడా మరో ఆనందం... దానికి కథాసమయం వాళ్లకు ధన్యవాదాలు.


నేను నేపథ్యం చెప్పాలనుకుంటున్న కథ: మరణ లేఖలు

ఇది సాక్షి-ఫన్డేలో 2008లో అచ్చయింది. ఒకవిధంగా ఇది నా రెండో కథ. ఒక విధంగా ఎందుకంటే, నాలుగైదు సింగిల్ పేజీ కథల్ని మినహాయించడం వల్ల...

చాలా గొప్ప కలలుగనే సమయంలో కూడా దానికి పూర్తి విరుద్ధమైన భయాలు ఏవో ఉంటాయనుకుంటాను మనిషికి. ఎందుకు చెప్తున్నానంటే, ఈ కథ మొదలుపెట్టినప్పటికి నాకు పెళ్లి కూడా కాలేదు.
కానీ దాంపత్య జీవితంలో ఒక శూన్యంలోకి జారిపోయే క్షణాలు వస్తాయి, ఒక నిరాసక్తత మొదలవుతుందన్న తెలివిడిలోంచి ఈ కథకు బీజం పడిందనుకుంటాను.

నేపథ్యం కోసం ఏదో చెబుతాంగానీ కాంక్రీట్ పాయింటుతో దేన్నయినా మొదలుపెడతామంటే నేను ఈజీగా నమ్మను. ఒక అంచునుంచి మొదలవుతాం... మనకు ఎక్కడో ఒక ఊహారేఖ ఉంటుంది, దాన్ని అందుకోవాలని తాపత్రయం ఉంటుంది... కానీ చివరికి ఎక్కడో తేలుతాం... నిజానికి మన ఊహారేఖకన్నా ఈ వాస్తవమే బాగుందని కూడా అనిపించవచ్చు.
పోతూవుంటే స్పష్టపడే దారిలాగా... రాస్తూవుంటే కూడా ఒక కొత్తరూపం వస్తూ రచనలో మిళితమైపోతుంది.

ఒక మనిషి ఆత్మహత్య చేసుకుని చనిపోవడం అనేది నన్ను ఎప్పుడూ కలిచివేస్తుంది. దాంపత్యంలో వచ్చే పొరపొచ్చాలు, వివాహానంతర ఆకర్షణలు, తార్కిక ముంగిపుకు తీసుకెళ్లలేని నైతిక సంకెళ్లు, ఆడవాళ్లు ఉద్యోగం చేయడం, దాన్నుంచి కుటుంబాల్లో వస్తున్న మార్పు... మనల్ని ఒక ఒడ్డుకు చేరనివ్వని ద్వంద్వం... ఇట్లాంటి ముక్కలు ముక్కల ఆలోచనలు అన్నీ ఇందులో ఉన్నాయి. బుచ్చిబాబు తరహాలో స్త్రీ పురుష వ్యాఖ్యానం చేయాలన్న ఉబలాటం కూడా ఉంటుంది.

2003లో పాతడైరీల్లో మొదలుపెట్టి... ఎటు తీసుకెళ్లాలో అర్థంకాక అలా ఉండిపోయింది కథ. కనీసం ఐదేళ్ల తర్వాత ఒక కొలిక్కి వచ్చింది. అంటే మనిషిలో ఉండే ద్వంద్వం కూడా సహజమైనదేనని నేను గుర్తించడం వల్ల ... దీనికి ముగింపు దొరికింది. ఇలాగే, ఇది ఇలాగే అనే నిర్దిష్టత జీవితానికి ఉండదనుకుంటున్నాను. బతకడం కోసం అవసరమైన ఈ ద్వంద్వాన్ని కథానాయకుడు అంగీకరించివుంటే బతికిపోయేవాడు.

నన్ను ఈ కార్యక్రమానికి ఆహ్వానించిన ఉమా, వెంకటేశ్...  ఇతర కథాసమయం మిత్రులకు థాంక్యూ చెబుతూ...
సెలవు.

No comments:

Post a Comment