Friday, September 16, 2016

మూడు పుస్తకాలపై ఒక స్పందన

(పాఠకమిత్రుడు అశోక్ చిన్నం ఏప్రిల్, 2016లో మెయిల్ ద్వారా పంపిన లేఖా స్పందనను ఇక్కడ పోస్ట్ చేస్తున్నా. ఒకట్రెండు అక్షర దోషాలు మాత్రం సవరించాను.)

రియాలిటీ చెక్
ఉద్వేగాలను అక్షర  రూపంలోకి బదిలీ చేయవచ్చు అని రియాలిటీ చెక్ చదివిన తరువాతే తెలిసింది. మన స్పృహలోకి రాకుండా మనలో అతి మాములుగా చెలరేగే అనేక భావాలు వాక్యరూపం లో చూసి, ఇటువంటి భావాలను కూడా రాయవచ్చా అని  ఆశ్చర్యపోయి, అక్కడే కొద్దిసేపు ఆగి, ఆ ఆశ్చర్యాన్ని సంపూర్ణంగా అనుభవించి, తిరిగి చదవడం మొదలుపెట్టేవాణ్ణి. ఇంత సాధారణ వ్యవహార భాషలో, ఇలాంటి వచనం లో కూడా మనసుకు హత్తుకుని, మెదడులో ఇంకిపోయేలాగా తత్వాన్ని వివరించారు. "ప్రపంచం రెండు పరస్పర విరుద్ధావకాశాలను మనముందుంచి ఎంచుకునే విచక్షణ మీద ఒత్తిడి పెడుతుంది." ఈ వాక్యం కంటి నుండి మెదడుకి చేరగానే ఒక్కసారిగా ఆలోచనలు మనల్ని మన గతంలోని అలాంటి సన్నివేశంలోకి తీసుకెళ్తాయి. "నిరాడంబరతను జీవన విధానంగా చూపిస్తే ఆ గుణాన్ని పూజిస్తారుగానీ తమ జీవితాల్లోకి తెచ్చుకోరు." ఈ వాక్యం తో దేవుడి స్వరూపాన్ని చూడడానికి నాకు ఒక కొత్త కోణం దొరికినట్టుగా అనిపించింది. నాలోని నాస్తికత్వాన్ని ఆస్తికత్వాన్ని ఒకేసారి సంతృప్తి పరచగలిగారు. మౌనసందేశం ఏదో ఇమిడి ఉంది అందులో. "మరణం మాత్రమే మనిషి విలువని నిక్కచ్చిగా లెక్కకట్టగలదు" అని చెప్పినపుడు మీలోని తాత్విక లోతులు కనిపించాయి. కొడుకుని పోగొట్టుకున్న తండ్రి బాధని సరాసరి మా మనసుల్లోకి బదిలీ చేయగలిగారు, మా కళ్ళను కూడా తడిగా చేయగలిగారు. ఈ పుస్తకం చదువుతూ ఆనందించాను, ఆశ్చర్యపోయాను, బాధపడ్డాను, మౌనంగా ఐపోయాను, నవ్వాను, కోపం తెచ్చుకున్నాను, నాలోకి నేను వెళ్లి చూసుకున్నాను, నాలోనుండి ప్రపంచాన్ని కొత్తగా చూసాను. సుమారు దశాబ్దంన్నర నా పఠనం ప్రపంచంలో ఇంతగా నన్ను ప్రభావితం చేసిన పుస్తకం ఇదే!

మధుపం
రియాలిటీ చెక్ చదివిన తర్వాత కలిగిన కుతూహలంతో మీరు రాసిన ఇతర పుస్తకాల గురించి  ఆరా తీసి పనిగట్టుకుని కాచిగూడకి వెళ్లి తెచ్చుకున్న పుస్తకం మధుపం. అవివాహితుడినైన నాకు పెళ్లి మీద ఉండే సహజ కుతూహలాన్ని పెంచుతూ, అదే సమయంలో అస్పష్టమైన ఆందోళనను కూడా కలిగించింది ఈ పుస్తకం. ఒకే మగ జీవితాన్ని నాలుగైదు సార్లు జీవిస్తే తప్ప ఇలాంటి స్పష్టత (?), భావాలు కలుగవేమో అనిపించింది. స్వచ్ఛమైన, నిర్మలమైన మగ రాజసాన్నిఎంతగా అనుభవిస్తే ఇలాంటి భావాలు కలగాలి! " ఆ నవ్వు .. జీవితాన్ని చాలా చూసాక ఇంకా అంతకంటే నువ్ నన్నేం చేయగలవ్? అన్న ధిక్కారంలో నుంచి వచ్చిన నవ్వు... నీకు ఎదురొడ్డి పోరాడుతున్నాను చూడు... అన్న మగ అహంకారం లోనుంచి వచ్చిన నవ్వు.." లాంటి వాక్యాలు చదివినప్పుడు పెదవులు, ఛాతి ఒకేసారి కొంచెం వెడల్పు అయ్యాయి.. ఇది చదివిన ప్రతి మగవాడు తమ ఆత్మకథగా ఫీల్ అవుతాడు అని చెప్పడంలో అతిశయోక్తి  ఏమి అనిపించడం లేదు నాకు. అంతగా ప్రచారం లేని ఈ పుస్తకాన్ని నా స్నేహితుడికి ఇచ్చేటప్పుడే  హెచ్చరించాను తిరిగివ్వడం మర్చిపోవద్దని..

పలక పెన్సిల్
మొదటి రెండు పుస్తకాలు చదివిన తర్వాత, ఈ పుస్తకం నుండి మరిన్ని అనుభూతులు, చిరునవ్వులు ఆశించడంలో తప్పు లేదు. మొదటగా, వెనక కవర్ పేజి మీద ఉన్న "నువ్ ఉన్నావన్న ఒకే ఒక్క కారణంతో ఈ ప్రపంచాన్ని క్షమించేసాను" అనే వాక్యం చదవగానే ఈసారి మన రాజిరెడ్డికి కృష్ణశాస్త్రి  పూనాడేమో అని సందేహం కలిగింది. "పల్లెటూరి  సౌందర్యం అర్థం చేసుకోవాలంటే పట్నం రావాల్సిందే"  అని చదవగానే ఒక్కసారిగా బాధ, జ్ఞాపకాలు గాలివానలాగ చుట్టుముట్టాయి. "తొలి అడుగు" వ్యాసం ఒకేరోజు 4 సార్లు చదువుకున్నాను.. "నేనేమిటి" చదువుతున్నంతసేపు నిలువుటద్దం లో నన్ను నేను చూసుకున్న భావన. చక్కని ఫుట్ కోట్ లు వ్యాసాలకు మరింత ఆకర్షణగా నిలిచాయి . అలవాటు ప్రకారం ప్రతి వ్యాసంలో నచ్చిన వాక్యాలు అండర్ లైన్ చేస్తూపోయాను... తద్వారా చివరికి తెలిసింది ఏమిటంటే నా పెన్ లో ఇంకు ఐపోయింది అని. మన సిరిసిల్ల వ్యక్తిలో ఇంత తాత్వికత, భావ ప్రవాహం, రచనాపటిమ, మనో సంఘర్షణా విశ్లేషణ ఎలా పెరిగి ఉంటుందబ్బా అని ఆలోచిస్తూ పుస్తకాన్ని అలమారలో సులువుగా కనిపించే విధంగా దాచుకున్నాను. బుచ్చిబాబు చివరకు మిగిలేది చదివిన తరువాత వచ్చే శూన్యం(?)  మరోసారి అనుభవించాను...

--
Ashok Ch.

Saturday, July 2, 2016

అన్ని రంగుల ప్రేమికుడు

ఓ, ఆరోజు కొంచెం సాహిత్యం గురించి కూడా మాట్లాడుకున్నాములే, మందెక్కువై.
ఆ గదిలో- దాన్ని గుహంటాను నేను- నలుగురం ఉన్నామప్పుడు.
మాటల దొర్లింపులో ఒక తొంబై ఏళ్ల పెద్దాయన ప్రసక్తి వస్తే, మా జట్టుకు నాయకుడిలాంటి వ్యక్తి ఇలా చెప్పాడు:
"ఆ పెద్దాయన ఎర్రటి కవికీ చప్పట్లు కొడతాడు; పచ్చటి కవినీ భుజం తడతాడు; నీలి కవినైనా చెవివొగ్గి వింటాడు; నిజమైన కవిత్వ ప్రేమికుడంటే నమ్ము''.
సరైన ట్యూనులో వినవచ్చే అదే పాటనూ, అదే ట్యూనులో దానికి పూర్తి వ్యతిరేకంగా ఉండే మరో పాటనూ కూడా నేను ఏకకాలంలో ఆనందించగలను. ఈ పెద్దాయనెవరో నాలాగే ఉన్నాడే!
అయితే, మాలో కవిత్వం రాసే అలవాటున్న స్నేహితుడు మరో సిగరెట్ ముట్టిస్తూ అడిగాడు:
"మీరు చెప్తున్నది వినడానికి బాగుంది సర్. కానీ నాదో సందేహం. దృక్పథం లేకుండా ఆనందించగలిగే లగ్జరీ ఆయనకు పుట్టుకతో వచ్చిందా? సాధన వల్ల వచ్చిందా?''

(జూన్ 6, 2016 సాక్షి సాహిత్యం/ కలంపేరుతో ప్రచురితం)

Tuesday, March 1, 2016

చిన్నోడు పెద్దోడయ్యాడు

మా చిన్నోడ్ని చిన్నోడంటే ఒప్పుకోడు. బదులుగా తన మూరెడు కొలతను చూపిస్తాడు. వాడికిప్పటికీ వాడి అన్న వాడికన్నా ముందు ఎందుకు పుట్టాడనేది సహించలేని విషయమే! అదేదో తానే పుట్టవచ్చుగా! అయితే వాడు పెద్దోడయ్యాడని అంగీకరించాల్సిన సందర్భం ఒకటి వచ్చింది.

(తరువాయి కింది లింకులో)

http://vaakili.com/patrika/?p=10221

(వాకిలి; ఫిబ్రవరి 2016)

Wednesday, February 24, 2016

వీడియో: ఒక బాటసారి బైరాగి పదాలు

ఒక బాటసారి బైరాగి పదాలు పేరిట ఛాయ వాళ్లు ఫిబ్రవరి 7న హైదరాబాదులో ఏర్పాటుచేసిన ప్రసంగ కార్యక్రమపు వీడియోలు ఇవి:

https://www.youtube.com/watch?v=SjdU70Ieg1A

https://www.youtube.com/watch?v=1byCHpP590w
Thursday, February 18, 2016

ఒక ప్రస్తావన


(ఫిబ్రవరి 1, 2016; సాక్షి - ఫ్యామిలీ)

Sunday, January 31, 2016

ఒక బాటసారి బైరాగి పదాలు

ఎఫ్బీ లోకి దాదాపుగా షిఫ్ట్ అయిపోయినా కూడా, ఇంకా ఈ బ్లాగే నాకు మరింత దగ్గరగా అనిపిస్తుంది. పోస్టులు పెద్దగా పెట్టకపోయినా కూడా, దీన్ని వదలకపోవడానికి అదో కారణం. ఎఫ్బీలో ఆల్రెడీ పోస్టు చేసినా కూడా బ్లాగు మిత్రులకోసం ఈ అహ్వానం.

రాయడం అంతకు పదేళ్లముందే మొదలుపెట్టినా, 2008 నుంచి 2015 వరకు ఈ ఎనిమిదేళ్లలో మూడు పుస్తకాలు ప్రచురించాను. మధుపం, పలక-పెన్సిల్, రియాలిటీ చెక్. ఇంకా పుస్తకాలుగా రానివి ఆజన్మం కాలమ్, ఆ తర్వాతి రాతలు... అలాగే, నా కథలు. వీటన్నింటి గురించి మిత్రుడు, విమర్శకుడు కాకుమాని శ్రీనివాసరావు ఫిబ్రవరి 7వ తేదీన సాయంత్రం 5:30కు దోమలగూడలోని ఇందిరా పార్క్ దగ్గరి  హైదరాబాద్ స్టడీ సర్కిల్లో మాట్లాడుతారు. ఆ రాతల్ని బట్టి, తన ప్రసంగానికి కాకుమాని ఎంచుకున్న శీర్షిక 'ఒక బాటసారి బైరాగి పదాలు'. ఈ కార్యక్రమ నిర్వహణ ఛాయ మిత్రులు.

వచ్చే ఆదివారం జరగనున్న ఈ కార్యక్రమానికి హైదరాబాదులో ఉన్న మిత్రులు ఎవరైనా వీలు చేసుకుని వస్తే సంతోషిస్తాను.

Saturday, January 23, 2016

చిన్నప్పటి ఒక సరసపు వాక్యం

ఈ విషయం విన్నప్పుడు నేను పెద్దగా ఆశ్చర్యపోకపోవడానికి కారణం, ఇలాంటిదొకటి జరగడం అనూహ్యం కాదనుకోవడమే!
మావాడి క్లాసులో ఉండే అక్షయ్‌రాజు అనే పిల్లాడు, అదే క్లాసులో చదివే ఒకమ్మాయిని పెద్దయ్యాక పెళ్లి చేసుకుంటాడట! అలా అని మావాడితో చెప్పాడట! వాడు ఆ మాటను మోసుకొచ్చి వాళ్లమ్మ చెవిలో వేశాడు.
(తరువాయి కింది లింకులో)

(వాకిలి: జనవరి 2016)

కథంటే ఏమిటి?

కథ, అంటే ఏమిటో నేను మొదలుపెట్టబోతున్నానంటే, నన్నెవరో కథ గురించి అడిగినట్టూ, అది అడిగించుకునేంత పెద్దవాణ్ని నేను అయిపోయినట్టూ ధ్వనిస్తోంది కదా!
మొదటిది నిజమే. రెండవది నిజమో కాదో, తర్వాత చూద్దాం.
(తరువాయి కింది లింకులో)

http://vaakili.com/patrika/?p=5820

(వాకిలి: జూలై 2014)

మన పర సమూహాలు

ఇదే శీర్షిక ఇంకెవరైనా పెట్టుంటే, వాళ్లేదో గంభీరమైన విషయం చెప్పబోతున్నారనుకుంటాను. కానీ నేను చెప్పబోయేది మాత్రం చాలా చిన్న ముక్క! దాన్నే నేరుగా రాసేస్తే అయిపోతుందిగానీ, దానితో ముడిపడిన ఒకట్రెండు విషయాల్ని కూడా చెప్పాలనిపించడం వల్ల అది కొసకు జారిపోయింది. ముందుగా ‘రియాలిటీ చెక్’ రాస్తున్నప్పటి ఒక సంగతి.
(తరువాయి దిగువ లింకులో)
http://patrika.kinige.com/?p=5291

(కినిగె పత్రిక: మార్చి 19, 2015)

రెండు మొదటిసార్లు

ఈ రెండింటి గురించి సాకులు వెతుక్కోవాల్సిన పని ఎప్పుడూ నాకు లేదు. స్నేహితులు బలవంతం చేశారు; మొహమాట పెట్టారు; ఇవేవీ నేను చెప్పను. ఇవి నాకు తెలియవచ్చినప్పటినుంచీ నేను చేసుకోదగిన అలవాట్లేనని నాకు తెలుసు.
గత రాత్రి చలిమంట దగ్గర ఎవరో మరిచివెళ్లిన ‘తునికాకుల చుట్లు’ పుట్టించిన కుతూహలం మొట్టమొదటి అనుభవం. కానీ లేత పెదాలకు ఆ రుచేమీ గుర్తులేదు.
మళ్లీ కౌమారపు మలిపాదంలో- బస్‌పాస్‌ మనల్ని ఎక్కడికైనా తీసుకెళ్తుందన్న భరోసా ఉన్న కాలంలో- అంటే- ఊరికే ఏదో బస్సెక్కేసి, ఎక్కడో దిగేసి, మరో బస్సెక్కి వచ్చెయ్యాలంతే! అలా ఉన్నట్టుండి జూ పార్కు ముందు దిగాం, నేనూ, శివిగాడూ.
(మిగతా కింది లింకులో)
http://patrika.kinige.com/?p=4977

(కినిగె పత్రిక: ఫిబ్రవరి 6, 2015)

దృశ్యం - భావం

రోడ్డు మీద మనకు తారసపడే ప్రమాద దృశ్యంలో – మనం పాలుపంచుకోవాల్సిన తప్పనిసరి అవసరం ఎప్పుడోగానీ రాదు. అక్కడెందుకో జనం గుమిగూడారని కుతూహలపడేలోపే, బాధితుడిని ఎవరో బండ్లో ఎక్కిస్తూవుండొచ్చు; అప్పటికే చెదిరిపోతున్న గుంపులోంచి, ‘ఎవరో బండిమీదికేలి వడ్డరు,’ అని వినాల్సి రావొచ్చు; అయితే, అలాంటి దాటిపోయే ప్రయాణికుడిగా ఉండలేని సందర్భం నాకోసారి ఎదురైంది. మా మధును కలవడానికి నేను హుడా కాలనీకి వెళ్తున్నాను. గంగారం దాటుతుండగా – ఉన్నట్టుండి నేను ప్రయాణిస్తున్న వాహనం సడెన్‌బ్రేక్‌తో ఆగిపోయింది; ‘అయ్యయ్యో’ ‘యాక్సిడెంట్’ లాంటి మాటలు దొర్లిపోతున్నాయి; ఒక్కసారిగా జనం మూగిపోయారు.
పెద్దాయన! పడిపోయివున్నాడు; కాలికి దెబ్బ తగిలింది; రక్తం కారుతోంది; హడావుడి మాటలేవో వినబడుతున్నాయి; ఒకాయనదైతే చాలా పెద్ద నోరు!
ప్రాథమిక కుతూహలం తీరిపోయాక, ఆయన చుట్టూ ఉన్న వలయంలోంచి ఒక్కొక్కరే వెనక్కి అడుగులు వేశారు. నేను ఉన్నచోటే ఉండటం వల్ల ముందుకైపోయాను.
(మిగతా కింది లింకులో)
(కినిగె పత్రిక: నవంబర్ 5, 2014)రెక్కల పెళ్లాం

అనగనగా అతడు ఈ పెళ్లికి అంగీకరించాడు. ఇంత వయసొచ్చీ పెళ్లి కాకుండా ఉన్న మగవాళ్లు అటు వైపు ఊళ్లల్లో ఎవరూ లేరు! ఇక, ఆడవాళ్ల గురించి చెప్పనే అక్కర్లేదు; పొరుగూళ్లలో ఉన్న అతడి చిన్నప్పటి స్నేహితురాళ్లు – ఈ పాటికి వాళ్ల కూతుళ్ల పెళ్లిళ్ల గురించి మథనపడుతూ ఉండివుంటారు!
కొంత వయసు ఖర్చయినా ఎట్టకేలకు తను కలగన్న భార్య దొరికింది. ఈ పరగణాలో అలాంటి ఇంకో అమ్మాయి ఉండే అవకాశమే లేదు!
తొలిపడకరోజు – మల్లెపూలు పెడుతున్న అల్లరిని కూడా గుర్తించకుండా – భార్య వీపును ఆత్రంగా తడిమాడు.
కొనదేలిన గూడుఎముకల స్పర్శ తప్ప, కావాల్సిన ఆనవాలు దొరకలేదు. ‘ఎక్కడో మోసం జరిగింది!’
తెల్లారి – పెళ్లి కోసం ఇన్నాళ్లుగా పట్టుబట్టిన అమ్మను నిలదీశాడు.
“నువ్వు మరీ చోద్యంరా; రెక్కల కోడల్ని ఎక్కడ్నించి తేను!”
(మిగతా దిగువ లింకులో)
(కినిగె పత్రిక: జూన్ 27, 2014)


పరిచిత అపరిచితుడు

అతడిని నేను మొదటిసారి ఎప్పుడు చూశానో గుర్తులేదు. నిజానికి, ‘మొదటిసారి’ అని ఎప్పుడు గుర్తు చేసుకుంటాం? ఆ పరిచయం ఎంతో కొంత సాన్నిహిత్యానికి దారి తీసినప్పుడు కదా! కానీ ఇక్కడ సాన్నిహిత్యం అటుండనీ, కనీస పరిచయం కూడా లేదు. కాకపోతే ఎక్కువసార్లు తటస్థపడుతున్న వ్యక్తిగా ఇతడు నాకు ‘పరిచయం’. అంతకుముందు కూడా కొన్నిసార్లు చూసేవుంటాను! కానీ, ఏదో ఒక ‘చూపు’లో- ‘ఈయన్ని నేను ఇంతకుముందు కూడా చూశాను,’ అని గుర్తు తెచ్చుకున్నాను.
(మిగతా కింది లింకులో)
http://magazine.saarangabooks.com/2015/12/30/%E0%B0%AA%E0%B0%B0%E0%B0%BF%E0%B0%9A%E0%B0%BF%E0%B0%A4-%E0%B0%85%E0%B0%AA%E0%B0%B0%E0%B0%BF%E0%B0%9A%E0%B0%BF%E0%B0%A4%E0%B1%81%E0%B0%A1%E0%B1%81/

(సారంగ: డిసెంబర్ 30, 2015)

రెండు దమ్ములు

నా కుతూహలానికి ఫలితం ఇవ్వాళ అనుభవించబోతున్నాను.
‘అన్నా, నైట్ ప్లాన్ ఏంటి? అక్కాపిల్లలు ఊళ్లో ఉన్నరా?’ అప్పుడెప్పుడో అనుకున్నది…’ పొద్దున్నే వంశీ నుంచి మెసేజ్.
ఇంట్లో నేనొక్కడినే ఉన్నాను. వేసవి సెలవులు కదా ఊరెళ్లారు. ఏ అజ్ఞాతస్థలంలోనో చేయాల్సివచ్చేది ఇంట్లోనే పెట్టుకోవచ్చు! ‘పక్కోళ్లు గుర్తుపట్టరు కదా!’
(మిగతా కింది లింకులో)
http://magazine.saarangabooks.com/2015/06/18/%E0%B0%B0%E0%B1%86%E0%B0%82%E0%B0%A1%E0%B1%81-%E0%B0%A6%E0%B0%AE%E0%B1%8D%E0%B0%AE%E0%B1%81%E0%B0%B2%E0%B1%81/


(సారంగ: జూన్ 18, 2015)

నేనేం మాట్లాడుతున్నాను?

ఒక మనిషికి, తన స్నేహితులతో- అది ఒక్కరో, ఇద్దరో, నలుగురో- లేదా తనకు చెందిన రోజువారీ గుంపుతో మాట్లాడటంలో ఏ ఇబ్బందీ ఉండదు. కానీ అదే మనిషి, ఒక పదిమంది తననే గమనిస్తున్నారని తెలిసినప్పుడు మాట్లాడటానికి తడబడతాడు. ఎందుకంటే అది తనకు అసహజమైన స్థితి. అలాంటి స్థితిలో కూడా సహజంగా మాట్లాడగలిగేవాళ్లే ఉపన్యాసకులుగా రాణిస్తారు.
కానీ నేను మాత్రం అలా మాట్లాడలేను. 
(మిగతా కింది లింకులో)
http://magazine.saarangabooks.com/2014/11/19/%E0%B0%A8%E0%B1%87%E0%B0%A8%E0%B1%87%E0%B0%82-%E0%B0%AE%E0%B0%BE%E0%B0%9F%E0%B1%8D%E0%B0%B2%E0%B0%BE%E0%B0%A1%E0%B1%81%E0%B0%A4%E0%B1%81%E0%B0%A8%E0%B1%8D%E0%B0%A8%E0%B0%BE%E0%B0%A8%E0%B1%81/


(సారంగ: నవంబర్ 19, 2014)

రియాలిటీ చెక్

RealityCheckరాజిరెడ్డి వాక్యాలు ఎక్కువ లోపలి వైపే చూస్తాయి. అక్కడ కనపడిందాన్ని ఏ అలంకారమూ దిగేయకుండా ఉన్నదున్నట్టుగానే పట్టుకోవాలని అతని ప్రయత్నం. ఈ ప్రయత్నంలోని నిష్ట ఎంత శుద్ధమైనదంటే, అది కథా కవితల్లాంటి ఇంకే తోవల్లోనూ ఇమడక తనదైన ప్రక్రియల్ని కూడా వెతుక్కుంటోంది. ఈ ప్రయత్నంలోంచి తెలుగు సాహిత్యానికి ఒక కొత్త గొంతు, తెలుగు వచనానికి ఒక కొత్త వాక్యమూ సమకూరాయి. సాక్షి ఫన్ డేలో ఆయన రాసిన స్థల పురాణాలు (ముఖ్యంగా హైదరాబాదు స్థలపురాణాలు) ఇప్పుడు పుస్తకంగా వెలువడ్డాయి. బహుశా ఇప్పటి హైదరాబాదుని తనలో బిగించి పట్టుకున్న కాలనాళికగా మున్ముందు ఈ పుస్తకం నిలిచిపోతుందేమో.
(జనవరి 1, 2014 నాటి కినిగె పత్రిక నుంచి...)