Saturday, July 2, 2016

అన్ని రంగుల ప్రేమికుడు

ఓ, ఆరోజు కొంచెం సాహిత్యం గురించి కూడా మాట్లాడుకున్నాములే, మందెక్కువై.
ఆ గదిలో- దాన్ని గుహంటాను నేను- నలుగురం ఉన్నామప్పుడు.
మాటల దొర్లింపులో ఒక తొంబై ఏళ్ల పెద్దాయన ప్రసక్తి వస్తే, మా జట్టుకు నాయకుడిలాంటి వ్యక్తి ఇలా చెప్పాడు:
"ఆ పెద్దాయన ఎర్రటి కవికీ చప్పట్లు కొడతాడు; పచ్చటి కవినీ భుజం తడతాడు; నీలి కవినైనా చెవివొగ్గి వింటాడు; నిజమైన కవిత్వ ప్రేమికుడంటే నమ్ము''.
సరైన ట్యూనులో వినవచ్చే అదే పాటనూ, అదే ట్యూనులో దానికి పూర్తి వ్యతిరేకంగా ఉండే మరో పాటనూ కూడా నేను ఏకకాలంలో ఆనందించగలను. ఈ పెద్దాయనెవరో నాలాగే ఉన్నాడే!
అయితే, మాలో కవిత్వం రాసే అలవాటున్న స్నేహితుడు మరో సిగరెట్ ముట్టిస్తూ అడిగాడు:
"మీరు చెప్తున్నది వినడానికి బాగుంది సర్. కానీ నాదో సందేహం. దృక్పథం లేకుండా ఆనందించగలిగే లగ్జరీ ఆయనకు పుట్టుకతో వచ్చిందా? సాధన వల్ల వచ్చిందా?''

(జూన్ 6, 2016 సాక్షి సాహిత్యం/ కలంపేరుతో ప్రచురితం)